గుంటూరు నగరంలో జన సమర్థంగా ఉండే మార్కెట్ సెంటర్‌లో దోపిడీ దొంగ బీభత్సం సృష్టించటం సంచలనం రేపింది. మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇరువురు పాత ఇనుము వ్యాపారుల కళ్లల్లో కారం కొట్టి కర్రతో దాడి చేసి రూ. 6.50 లక్షలు ఉన్న రెండు బ్యాగులతో ఉడాయిస్తున్న దోపిడీ దొంగను స్థానికులు వెంటాడిపట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళుతుండగా వారిని నెట్టేసి దొంగ పరారయ్యాడు. దీంతో వారు వెంటాడి మళ్లీ అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.
ఈ దాడిలో అబ్దుల్ కలాం అనే వ్యాపారికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేటలోని గుర్రాలచావిడి ప్రాంతానికి చెందిన మౌలాలి, అద్దంకికి చెందిన అబ్దుల్ కలాంలు పాత ఇనుము వ్యాపారం చేస్తుంటారు. పాత ఇనుము కొనుగోలు చేసి మార్టూరులోని ప్యాక్టరీకి తరలిస్తుంటారు. అయితే విద్యానగర్‌లోని వ్యాపారి వద్ద మంగళవారం రాత్రి మౌలాలి రూ. 3.50 లక్షలు, అబ్దుల్ కలాం రూ. 3 లక్షలు తీసుకొని రెండు వేర్వేరు బ్యాగుల్లో ఆటోలో బయల్దేరారు. మార్కెట్ సెంటర్‌లో దిగి బస్సు కోసం వేచి ఉన్నారు. అయితే దోపిడీ దొంగ ఒక్కసారిగా వారి కళ్లల్లో కారం కొట్టి కర్రతో దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు పాత కక్షల నేపథ్యంలో దాడి జరుగుతుందని భావించారు.
ఈ దాడిలో అబ్దుల్ కలాం తలకు రెండు చోట్ల బలమైన గాయాలై పడిపోయాడు. అయినప్పటికీ బ్యాగ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో దొంగ బలవంతంగా ఇరువురి వద్ద ఉన్న బ్యాగ్‌లను గుంజుకొని పరారయ్యాడు. దీంతో వ్యాపారులు దొంగ, దొంగ అని కేకలు వేయటంతో అప్రమత్తమైన స్థానికులు వెంటపడి దొంగను పట్టుకొని దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న సీసీఎస్ డీఎస్పీ నంజుండప్ప, కొత్తపేట రక్షక్ వాహనం, లాలాపేట బ్లూ కోల్ట్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గాయపడిన కలాంను 108లో జీజీహెచ్‌కు తరలించారు. కాగా ఘటనా స్థలంలో అపస్మారక స్థితిలో ఉన్నట్లు నటిస్తూ దొంగ పడిపోయాడు. దీంతో స్థానికులు ఆటోలో ఎక్కించారు. పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లిన తరువాత దొంగ ఒక్కసారిగా కానిస్టేబుల్ అంబేద్కర్ (పీసీ 645), రక్షక్ ్రడైవర్ అన్వర్ బాషాలను కట్టేసి దొంగ మళ్ళీ పరారయ్యాడు.
దీంతో వారు పట్నంబజారు బంగారపు కొట్ల వరకు పరిగెత్తి దొంగను పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. సమాచారం అందుకున్న ఈస్ట్, వెస్ట్ డీఎస్పీలు టీవీ నాగరాజు, డి కోటేశ్వరరావు, సీఐ మధుసూదనరావు తదితరులు స్టేషన్‌కు చేరుకొని పట్టుబడిన దొంగను విచారిస్తున్నారు. తెనాలికి చెందిన రఫీగా గుర్తించినట్లు సమాచారం. గతంలో అతనిపై ఉన్న కేసులు ఇంకా ఏమైనా వెలుగు చూడని నేరాలకు పాల్పడ్డాడా అనేదానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. గత పది రోజుల క్రితం కూడా మార్కెట్ సెంటర్‌లో కారులో వెళుతున్న వ్యాపారుల సూట్‌కేస్‌ను కూడా ఇదే విధంగా గుంజుకొని పరిగెత్తుతుండగా స్థానికులు వెంటపడి పట్టుకొని దొంగను దేహశుద్ధి చేసినట్లు విచారణలో వెల్లడైంది. అయితే అప్పుడు వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం.
స్థానికుల స్పందనకు ప్రశంసలు
దోపిడీ చేసి పారిపోతున్న దొంగను వెంటాడి పట్టుకున్న స్థానికులు ప్రశంసలు అందుకున్నారు. ఏ మాత్రం భయపడకుండా వారు దొంగను పట్టుకొని అప్పగించటం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఇదే విధంగా స్థానికులు తమ వంతుగా సహకరిస్తే నేరాలను అరికట్టటం సులువు అవుతుందని వారు అంటున్నారు. అదేవిధంగా పారిపోతున్న దొంగను వెంటాడి పట్టుకున్న కానిస్టేబుల్ అంబేద్కర్, ్రడైవర్ అన్వర్ బాషాతో పాటు బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు సురేష్ (పీసీ 2823), సుభాని (పీసీ 2589)లను అదేవిధంగా సహకరించిన స్థానిక యువకుడు వినోద్‌కుమార్‌లను పోలీసు అధికారులు అభినందించారు.
No comments:
Post a Comment