ఇటు డిస్టిలరీ.. అటు దుకాణ యాజమాన్యం చేతివాటం
ఎక్కువ నీటిని వినియోగిస్తున్న డిస్టిలరీలు
మూత తొలగించి నీళ్లు పోస్తున్న దుకాణదారులు
పలచనవుతున్న మద్యం
పెగ్గు మీద పెగ్గు కొట్టి నడిరోడ్డుమీద స్వర్గవిహారం చేసే మందు మహరాజుల్ని అప్పుడప్పుడూ అక్కడక్కడా చూస్తూనే ఉంటాం. కానీ ఈ మధ్య ఏ మందుబాబును కదిపినా ‘ఫుల్లు కొట్టినా కిక్కు లేదు గురూ’ అంటూ నిట్టూరుస్తున్నారు. మత్తెక్కించే మందులోనే తేడా ఉందని తెలియక జుట్టు పీక్కుంటున్నారు. రాష్టవ్య్రాప్తంగా దాదాపు 40 శాతం నీళ్లు కలిపిన కల్తీ మద్యాన్నే విక్రయిస్తున్నారని ఇటీవలి సంఘటనలు బయటపెడుతున్నాయి. డిస్టిలరీ యాజమాన్యం, మద్యం దుకాణదారులు ఒకరికి తెలియకుండా మరొకరు విచ్చలవిడిగా మద్యం సీసాలో నీళ్లు కలుపుతుండటంతో కిక్కు తగ్గిపోతోంది. ఈ దందా డిస్టిలరీల్లోనే మొదలవుతోంది. గతంలో సీగ్రాం ఉత్పత్తులు, ఇటీవలి కాలంలో ఆఫీసర్స్ చాయిస్, అరిస్ట్రోక్రాట్, అశోక విస్కీల కల్తీ వ్యవహారం బ్రాండెడ్ మద్యం లోగుట్టును బయటపెట్టాయి. ఎక్సైజ్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో డిస్టిలరీలు లిక్కర్ తయారీలో ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్‌ఏ) శాతం తగ్గించి నీళ్లు కలుపుతున్నాయి. ఒక్క శాతం నీళ్లు అదనంగా ఉపయోగించినా డిస్టిలరీ యాజమాన్యానికి ’ లక్షల్లో ఆదాయం ఉంటుంది. రోజుకు ఐదు వేల కేసుల మద్యం ఉత్పత్తి చేయగలిగే డిస్టిలరీ నుంచి తయారైన మద్యంలో ఒక శాతం అదనంగా నీళ్లు కలిపితే 2,500 లీటర్ల ఈఎన్‌ఏ మిగులుతుంది. దీన్ని తిరిగి మద్యం తయారీ కోసం వినియోగిస్తే 275 కేసుల మద్యం ఉత్పత్తి అవుతుంది. లేదంటే మిగిలిన ఈఎన్‌ఏను నేరుగా విక్రయించినా 2,500 లీటర్లకు రూ.1.20 లక్షలు (లీటర్ ధర రూ.48 చొప్పున) వస్తాయి. ఈ అదనపు లాభాలకోసమే డిస్టిలరీల యాజమాన్యాలు కల్తీకి పాల్పడుతున్నాయి. ప్రస్తుతం రాష్ర్టంలో ఉన్న అన్ని డిస్టిలరీలు కూడా సగటున రోజుకు 10 వేల కేసుల మద్యం ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉన్నవే.
మూత తీసి... నీళ్లు పోసి
డిస్టిలరీల నుంచే కల్తీతోవస్తున్న మద్యంపై దుకాణదారులు కూడా తమ చే తివాటాన్ని చూపుతున్నారు. ఎక్సైజ్ అధికారులు వేసిన సీల్ చెదిరిపోకుండా సీసాపై మూతను తొలగిస్తున్నారు. సీసాలోంచి 100 నుంచి 150 మిల్లీలీటర్ల లిక్కర్ తీసి అంతే మొత్తంలో నీళ్లు పోస్తున్నారు. అనుమానం రాకుండా తిరిగి సీల్ వేసి విక్రయిస్తున్నారు. లేబులింగ్ విభాగంలో పనిచేసే ఎక్సైజ్ అధికారులు తప్ప సాధారణ విధులు నిర్వర్తించే ఎక్సైజ్ సిబ్బంది నకిలీ మద్యం సీసాను, దానిపై వేసిన సీల్‌ను గుర్తుపట్టలేరు. దీంతో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. గతంలో ఇలాంటి మోసాలు మెట్రోపాలిటన్ సిటీలో ఉన్న మద్యం దుకాణాల్లో మాత్రమే జరిగేది.
వేసిన సీల్ చెడిపోకుండా సీసాపై మూతలు తొలగించగల నిపుణులు కూడా చాలా కొద్దిమంది మాత్రమే ఉండేవారు. ఇప్పుడు వీళ్లు రూ. 5000 తీసుకుని ఆసక్తిఉన్న నిరుద్యోగ యువకులకు తర్ఫీదునిస్తున్నారు. మద్యం దుకాణాలు కూడా నమ్మకస్తుడైన తమ వ్యక్తికి సీసా మూతలు తొలగించడంలో తర్ఫీదు ఇప్పిస్తున్నాయి. దీంతో మారుమూల మండలాల్లో కూడా మద్యంలో నీళ్లు కలిసి పలచనవుతోంది. వరంగల్ జిల్లా జనగామలోని సింధుసాయి వైన్స్‌లో మూతలు తొలగించి మద్యం కల్తీ చేస్తుండగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఇలాంటి విధానమే రాష్టవ్య్రాప్తంగా అమలవుతోందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారి ఒకరు చెప్పారు.