మద్యం షాపులపై ఏసీబీ దాడులు అధికం కావడంతో
రెండు నెలలుగా లెసైన్సు ఉన్న షాపుల్లో ఎమ్మార్పీకే విక్రయిస్తున్నారు.
ఇలాగైతే లాభాలు రావడం లేదని గ్రహించిన వ్యాపారులు బెల్టుషాపుల్లో మద్యం
విక్రయాలను పెంచారు. ఎక్సైజ్ అధికారుల లెక్కల ప్రకారం పదివేలకు పైగా
బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. మద్యం షాపుల్లో కన్నా
బెల్టుషాపుల్లోనే అధికంగా విక్రయాలు జరుగుతున్నాయి. ఎమ్మార్పీ కన్నా ఇక్కడ
ఐదు రూపాయలు అదనంగా క్వార్టర్ బాటిల్‌కు వసూలు చేస్తున్నారు. రాష్ట్రం లోని
అన్ని పంచాయతీల్లోను ఒకటి, రెండు చొప్పున బెల్టుషాపులున్నాయి. పట్టణ
ప్రాంతాల్లో ప్రతి సెంటర్‌కు రెండేసి చొప్పున ఏర్పాటు చేశారు. దీంతో
వ్యాపారులు ప్రాంతాలవారీగా బెల్టుషాపులను విభజించుకుని వ్యాపారం
నిర్వహిస్తున్నారు.
పట్టించుకోని పోలీసులు..
గత నెలలో అందరు డీఎస్పీలు బెల్టుషాపులను మూసివేయాలని హుకుం జారీ చేశారు. దీంతో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని బెల్టుషాపులు పది రోజుల పాటు మూతపడ్డాయి. మే నెల ప్రారంభం నుంచి మళ్లీ తెరుచుకున్నాయి. ప్రారంభంలో ఉన్న పోలీసుల హడావుడి రానురాను తగ్గిపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరని ప్రజలు అనుకుంటున్న సమయంలోనే మళ్లీ బెల్టుషాపులు తెరుచుకోవడంతో అవాక్కవడం ప్రజల వంతయింది. మద్యం సిండికేట్లుగా వ్యవహరించే కొందరు వ్యక్తులు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి బెల్టుషాపులను మళ్లీ నడుపుతున్నారనే వాదన లేకపోలేదు. గత నెల 27న గిలకలదిండిలో ప్రజాపథం జరిగిన సమయంలో అక్కడ బెల్టుషాపు కారణంగా తాము పడుతున్న ఇబ్బందులపై మహిళలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నారు. పోలీసులే ఈ బెల్టుషాపుపై దాడిచేసి మూయించివేశారు. పట్టుమని పది రోజులు కాకుండానే మళ్లీ ఈ బెల్టుషాపులో మద్యం విక్రయాలు యథావిధిగా జరగడం విశేషం. కాలేఖాన్‌పేట వద్ద రెండు బెల్టుషాపులున్నాయి. ఓ బెల్టు షాపు పక్కనే ప్రయాణికుల విశ్రాంతికోసం కట్టిన షెడ్డు తాగుబోతులకు డెన్‌గా మారింది. రాత్రి ఏడు గంటలకల్లా ఈ షెడ్డు మందుబాబులతో నిండిపోతోంది.
అధిక ధరలకు విక్రయాలు...
మంగినపూడి బీచ్‌లో పర్యాటక శాఖ ఏర్పాటుచేసిన షాపులో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నా పట్టించుకునేవారే లేకుండా పోయారు. అన్ని షాపుల్లో ఎమ్మార్పీకే విక్రయాలు జరుగుతున్నా బీచ్‌లోని మద్యం షాపులో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ అధికారులు ఆవైపు చూసిన దాఖ లాలే లేవు. పోలీసులు, వ్యాపారులు కుమ్మక్కై బెల్టుషాపులను జోరుగా నడుపుతున్నారనే విమర్శలు ప్రజలనుంచి వ్యక్తమవుతున్నాయి.

No comments:
Post a Comment