Total Pageviews

Wednesday, May 9, 2012

వేసవిలో బడి పిల్లలకు పస్తులేనా?

పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, బడికి హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి మాత్రమే ఉద్దేశించినది కాదు. బడి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యం కూడా అందులో ఇమిడి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారంతా పేద పిల్లలే. దినదిన గండంగా బతికే పేదల పిల్లలకు పౌష్టికాహార లోపమే కాదు, పస్తులూ తప్పవు. అందుకే మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టిన తర్వాత పాఠశాలల్లో నమోదు గణనీయంగా పెరిగింది. ఒక పూట భోజనానికి హామీనిస్తున్న బడులకు వేసవి సెలవులు వస్తున్నాయంటే పేద పిల్లలకు పస్తుల కాలం వస్తున్నట్టే అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో, ప్రత్యేకించి గిరిజన తండాలలో పేద బడి పిల్లలు ఆకలితో అలమటించే సమస్య తీవ్రంగా ఉంది.

విద్యా హక్కు చట్టాన్ని తెచ్చి ప్రభుత్వం ప్రతి పిల్లవానికి తప్పనిసరి ఉచిత విద్యను శాసించడం ముదావహం. అయితే పిల్లలు సెలవుల్లో కూడా కడుపు నింపుకోగలిగితేనే సక్రమంగా తిరిగి చదువులు కొనసాగించగలుగుతారని, మానవాభివృద్ధి వనరుల అభివృద్ధికి తోడ్పడతారని ప్రభుత్వం గుర్తించాలి. ఇక బాలలకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యం ఏడాది పొడవునా ఉండాల్సిందే తప్ప పాఠశాలలు తెరిచే కాలానికే పరిమితమైతే ఫలితం అంతగా ఉండదు. అన్నిటికీ మించి ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి పేద బడి పిల్లలు పస్తులతో అల్లాడకుండా ఆదుకోవడం అవసరం.

No comments:

Post a Comment