Total Pageviews

Wednesday, May 9, 2012

బాల కార్మికులను బడిలో చేర్చాలి!

మానవ వికాసానికి, సర్వతో ముఖాభివృద్ధికి విద్య తప్పనిసరి. విద్యార్జన క్రమంలో ప్రాథమిక విద్య అత్యంత ప్రముఖమైనది. అందుకే మన రాజ్యాంగంలో ఆర్టి కల్ 45, 14 సంవత్సరాలలోపు బాలలందరికీ ఉచిత విద్యనందించే లక్ష్యాన్ని నిర్దేశిం చింది. (86వ సవరణ ద్వారా 6-14 సంవత్సరాల బాల లకు 21(ఎ) ప్రకారం భారతదేశ బాలలందరికీ ఉచిత ప్రాథమిక విద్య పొందే చట్టబద్ధమైన హక్కు ఏర్పడింది.) ఆర్టికల్ 24, 14 సంవత్సరాలలోపు బాలలు కర్మాగారాలలో పనిచేయడాన్ని నిషేధించింది.

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు విడివిడిగాను, ఉమ్మడిగాను జాతీ య బాలకార్మిక పథకం (ఎన్‌సీఎల్‌పీ), ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకం (ఓబీబీ), జిల్లా ప్రాథ మిక విద్యాపథకం (డీపీఈపీ), మళ్లీ బడికి కార్యక్రమం, సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలకు యూనిసెఫ్, ఐఎల్‌ఓ, యూరోపియన్ యూని యన్, ప్రపంచ బ్యాంకు, కార్పొరేట్ సంస్థలు, స్థానికంగా పనిచేస్తున్న స్వచ్ఛందసంస్థలు తమ తోడ్పాటునందిస్తున్నాయి.

గత రెండు దశాబ్దాలకుపైగా ఆంధ్రప్రదేశ్‌లో బాలకార్మిక వ్యవ స్థను రూపుమాపేందుకు కోట్లాది రూపాయలు ఖర్చుచేసినా, ఆశించిన మేర ఫలితాలు ఉండ టం లేదు. రాష్ర్ట విద్యాశాఖ వారి గణాంకాల ప్రకారం 2003-04 విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో 15,69,260 మంది విద్యార్థులు చేరగా 2007-08 విద్యా సంవత్సరంలో 5వ తరగతికి వచ్చేసరికి 2,13,502 మంది మాత్రమే మిగిలారు. ఇందులో అత్యధికులు బాలికలు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన బాలల సంఖ్య కూడా అధికమే.

ఒక తరగతిలోనే దాదాపు 4.5 లక్షల మంది బడిమానేస్తే ఇక అన్ని తరగతుల డ్రాపౌట్స్ లెక్కిస్తే ఎన్ని లక్షల మంది ఉండాలి? బడిలో చేరి బడి మానేస్తున్న వారి సంఖ్యే దాదాపు 30 శాతం ఉంటే బడి మెట్లెక్కని బాలల సంఖ్య ఇంకెంత ఉండాలి? ఒక అంచనా ప్రకారం 6-14 సంవత్సరాల బాలలు దాదాపు 50 శాతం మంది బాల కార్మికులుగా ఉన్నారు. గత సంవత్సరం మన రాష్ట్రంలో బడి బయటి బాలలు కేవలం 1.20 లక్షల మంది అని చెప్పి ప్రస్తుతం 3 లక్షలు అంటున్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చిత్తశుద్ధితో పనిచేయక యాంత్రికంగా పనిచేసే యంత్రాంగం, అధికా రుల ఉదాసీనత, పథకాల పర్యవేక్షణ లోపం, అధికారుల, శాఖల మధ్య సమన్వయలోపం, ప్రభుత్వ బడుల్లో అస్తవ్యస్తమైన పర్యవేక్షణ వంటి కారణాల వలన బాల కార్మికుల జీవితాల్లో చీకటి తొలగడం లేదు.

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు బాలకార్మిక నిషేధ, నియంత్రణ చట్టం 1986ను సవరించి అన్ని రంగాలలో బాలకార్మికులు పనిచేయడాన్ని నిషేధించి శిక్షలను కఠినతరం చేయాలి. సమర్థంగా విద్యాహక్కు చట్టం 2009ని అమలు చేయాలి. బాలికల చదువుకు ప్రాధాన్యతనిచ్చే కార్యక్రమాలు చేపట్టాలి. షెడ్యూల్డ్ కులాలు, తెగలవారికి నాణ్య మైన వసతి గృహాలు నిర్వహించాలి. బాల కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులను నిషేధించాలి.

 

2 comments:

  1. kani kondaru pillalu chaduvu kovadaniki mundiki ravatledhu ...enni chattalu unna emi chesina vallu adige maata ...ee chaduvu na potta nimpanappudu enduku ee chaduvulu. bcoz i faced this situation.
    ..
    bharatiyulam.

    ReplyDelete
    Replies
    1. nenu oppukontunnanu samadhanam mee post lone undi. potta nindithey chaduvukovataniki evariki abhyantharam undadu

      Delete