Total Pageviews

Saturday, April 30, 2011

అగ్ర కులం అగచాట్లు



దేవుడా ఏమిటీ దుస్థితి!
వెనకబడిన బ్రాహ్మణులు..
దారిద్య్ర రేఖకు దిగువన 55 శాతం మంది

నెలకు వారి తలసరి ఆదాయం రూ.650 లోపే
బిడ్డలను చదివించుకోలేని దుస్థితి
పది, ఇంటర్‌తోనే చదువులకు స్వస్తి
రీయింబర్స్‌మెంట్లు, స్కాలర్‌షిప్‌లకు దూరం
నెలకు రూ. 500తో జీవించే కుటుంబాలెన్నో
బ్రాహ్మణుల దుస్థితిపై జె. రాధాకృష్ణ సర్వే

హైదరాబాద్, ఏప్రిల్ 30 : 'లోకాఃసమస్తాం సుఖినోభవంతు' అంటూ ప్రపంచమంతా సుఖ సంతోషాలతో వర్థిల్లాలి అని కోరుకునే బ్రాహ్మణులు ఇప్పుడు దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. ఒకప్పుడు అన్ని వర్గాలకూ మార్గనిర్దేశకులు ఇప్పుడు దారీతెన్నూ కనిపించక అలమటిస్తున్నారు. విద్యా బుద్ధులు నేర్పించే గురువులుగా కీర్తిగడించిన వారు ఇప్పుడు తమ బిడ్డలను చదివించుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మంచికీ చెడుకీ ఊరికి పెద్ద దిక్కుగా ఉన్న వారు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బ్రహ్మ స్వరూపులుగా పిలిచే బ్రాహ్మణుల పరిస్థితి రాష్ట్రంలో ఇప్పుడు కడు దయనీయంగా మారింది.

రాష్ట్రంలో 55 శాతం మంది బ్రాహ్మణులు దారిద్య్ర రేఖకు దిగువనే ఉన్నారు. నెలకు వారి తలసరి ఆదాయం కూడా రూ.650లోపే! ఇక, బ్రాహ్మణుల్లో నిరుద్యోగుల శాతం (75 శాతం) అన్ని వర్గాల కంటే ఎక్కువ. తమ బిడ్డలను వారు ఇంటర్మీడియట్‌కు మించి చదివించుకోలేకపోతున్నారు. ఒకప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవారు ఇప్పుడు కుల వృత్తితోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. బ్రాహ్మణుల దుస్థితిపై జే.రాధాకృష్ణ దేశవ్యాప్తంగా సర్వే చేశారు. ఆ వివరాలతో 'బ్రాహ్మిన్స్ ఆఫ్ ఇండియా' పేరిట ఓ పుస్తకాన్ని ముద్రించారు. ఛుగ్ పబ్లికేషన్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.

రాష్ట్రంలోని అర్చకులంతా దారిద్య్ర రేఖకు దిగువనే జీవిస్తున్నారని ఆ సర్వే వెల్లడించింది. ప్రస్తుత వ్యవస్థలో వెనకబడిన తరగతులకు కల్పించిన రిజర్వేషన్లు, ఆర్థిక ప్రతిబంధకాలు కలగలిసి తమ బిడ్డలకు మంచి చదువు చెప్పించలేని దుస్థితి నెలకొందని బ్రాహ్మణులు ఆవేదన చెందారు. బ్రాహ్మణ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని సర్వే స్పష్టం చేసింది. బ్రాహ్మణేతరులతో పోలిస్తే బ్రాహ్మణుల సరాసరి ఆదాయం చాలా తక్కువ. ఫలితంగా, ఇంటర్మీడియట్ స్థాయిలోనే బ్రాహ్మణ విద్యార్థుల్లో అత్యధిక శాతం చదువులకు స్వస్తి పలికేస్తున్నారు.

ఐదు నుంచి 18 ఏళ్ల వయసు విద్యార్థుల్లో.. 44 శాతం మంది ప్రాథమిక విద్య స్థాయిలోనే బడికి గుడ్‌బై చెప్పేస్తున్నారు. 36 శాతం మంది పదో తరగతి దాటడం లేదు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ బ్రాహ్మణుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌కు భిన్నంగా లేదని సర్వే స్పష్టం చేసింది. బ్రాహ్మణుల దీనావస్థకు సంబంధించిన గణాంకాలను ఇటీవల కర్ణాటక ఆర్థిక శాఖ మంత్రి ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే చదివి వినిపించారు. క్రిస్టియన్ల తలసరి ఆదాయం రూ.1562 అయితే.. వక్క లింగాలు రూ.914, ముస్లింలు రూ.794, ఎస్సీలు రూ.680, ఎస్టీలు రూ.577 ఉంటే ఆ రాష్ట్రంలో బ్రాహ్మణుల తలసరి ఆదాయం రూ.537గా ఉందని స్పష్టం చేశారు. తొలి రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్రాహ్మణులే అత్యధికంగా ఉండేవారు.

ఆ తర్వాతి కాలంలో న్యాయవాదులు, వైద్యులు వంటి ప్రొఫెషనల్ ఉద్యోగాలనూ పొందారు. కానీ, ప్రస్తుతం బ్రాహ్మణేతరులకే పెద్దపీట వేసే ప్రభుత్వ విధాన నిర్ణయాల కారణంగా బ్రాహ్మణులు ఆయా రంగాల నుంచి ఎప్పుడో కనుమరుగయ్యారని, ఆంధ్రప్రదేశ్‌లో చేసిన అధ్యయనాన్ని పరిశీలిస్తే.. ఆ రాష్ట్రంలో అత్యధిక బ్రాహ్మణులు ఇళ్లల్లో పనివారుగా బతుకీడుస్తున్నారని రాధాకృష్ణ తన సర్వేలో వెల్లడించారు. ఇదంతా ప్రతిభ లేక.. చదవలేక కాదు.. చదువును కొనుక్కునే స్తోమత లేకనే. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు వీరికి అందవు.

కేవలం నెలకు రూ.500తో కుటుంబాన్ని నెట్టుకొచ్చే కుటుంబాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో అని వెల్లడించారు. ఇందుకు కారణం.. ప్రభుత్వం నుంచి ఒక్క పథకమూ వారికి అందదు. రాష్ట్రవ్యాప్తంగా 56 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో బ్రాహ్మణులు ఉన్నా.. రచ్చబండ లాంటి కార్యక్రమాలు వారికి బహు దూరం. అగ్ర కులం పేరిట నిరుపేద బ్రాహ్మణులనూ ప్రభుత్వ పథకాలకు దూరం చేసేశారు.

సమాజంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన ప్రజలందరికీ తెల్లకార్డులు అందుతాయి. ఇల్లు, ఇళ్ల స్థలాలు, పొలాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు తదితర ప్రభుత్వ పథకాలు దక్కుతాయి. కానీ, బ్రాహ్మణులకు మాత్రం ఇవన్నీ దూరమే. బ్రాహ్మణుల్లో కేవలం పది శాతం మించి ఉన్నత విద్యనభ్యసించే పరిస్థితి లేదు. 35 శాతం అర్చకులుగా, పౌరోహిత్యంలోనూ జీవిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు

Courtesy: Andhrajyothy Telugu Daily


2 comments:

  1. అలాంటప్పుడు బ్రాహ్మణ వర్గానికే చెందిన సంపన్నులు , మధ్య తరగతి వారు పేదలను ఆదుకోవాలి. తప్పదు.

    ReplyDelete