ఎవరి కొసం ఈ రీసెట్లెమెంట్? ఆమరావతి రైతులను మరో సారి ముంచుతున్న ప్రభుత్వం!!!
సిఆర్‌డిఏ పరిధిలో ప్రభుత్వం తీసుకొచ్చిన రీసెటిల్‌మెంట్ పాలసీ డ్రాఫ్ట్‌పై రైతుల్లో కలకలం రేపింది. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో శుక్రవారం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా రీసెటిల్‌మెంట్ పాలసీని ప్రభుత్వం ఎందుకు తీసుకువచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం రూపొందించిన డ్రాఫ్ట్‌ను లోతుగా పరిశీలించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్తగా వచ్చే ప్రాజెక్టులకు భూములు తీసుకునే విషయమే అయితే పూలింగు, లేదా నెగోషియబుల్ పాలసీ ఉందని, కొత్తగా రీసెటిల్‌మెంట్ విధానం ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. రీసెటిల్ అంటేనే నివాస ప్రాంతాన్నిగానీ, లేదా ప్రజలను గానీ వేరే ప్రాంతానికి తరలించడమేనని, ప్రస్తుతం రాజధానిలో ఎవరిని తరలించడానికి ఈ పాలసీని తీసుకొచ్చారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దీనిపై సిఆర్‌డిఎ అధికారులు ఇప్పటి వరకూ కనీస చర్చ కూడా పెట్టలేదని పలువురు ప్రజాశక్తికి తెలిపారు. ఇప్పటికే భూములన్నీ ఇచ్చేశామని, రైతులకు వచ్చిన ప్లాట్లనూ ప్రాజెక్టుల కోసం తీసుకుంటే, అంతే భూమిని వేరేచోట ఇస్తామనే విధంగా పాలసీలో పొందుపరిచారని, అంటే ఎక్కడో సుదూరంగా ఇస్తే ఎలా అని వారు అడుగుతున్నారు. ఇంత అర్జంటుగా సెటిల్‌మెంట్ పాలసీ ఎందుకు తెచ్చారో కూడా చెప్పడం లేదని, బహిరంగ చర్చలో చెప్పేటట్లయితే ముందుగానే వారనుకున్న నిర్ణయాలు చెప్పేసి ఆమోదించినట్లు రాసుకుంటారని, దీనివల్ల రైతులకు, రాజధాని ప్రజలకు నష్టం జరుగుతుందనే అభిప్రాయం వారిలో ఉంది.
కొత్తగా ఏర్పాటు చేసే రోడ్లు, రైలు మార్గాలు, అంతర్జాతీయస్థాయిలో ప్రైవేటు డెవలపర్లకు ఇచ్చే ప్రాజెక్టులు రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లలోనే ఉంటాయని, వాటిని తీసుకోవడం, ఎక్కడైనా గ్రామాల్లో అడ్డుగా ఉన్న ఇళ్లను తొలగించడం వంటి పనుల కోసమే దీన్ని తెచ్చారని అంటున్నారు. అదే జరిగితే కొందరు సర్వం కోల్పోతారని, అది ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం కోసం తాము పోరాడామని, ఇప్పుడు తమకోసం తాము పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. ప్రపంచబ్యాంకు షరతుల ప్రకారం ఈ విధానాన్ని తీసుకురావడమంటే ఖచ్చితంగా అమలు చేసి తీరుతారని అంటున్నారు.
No comments:
Post a Comment